మాజీ మేయర్ చెప్పులు మాయం..కుక్కలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్

మాజీ మేయర్ చెప్పులు మాయం కావడంతో ఆ చెప్పులను కుక్కలే తీసుకెళ్లాయనే అనుమానంతో వాటికీ కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేసిన ఘటన ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. నక్షత్రవాడీ ప్రాంతంలో ఉండే మాజీ మేయర్ నందకుమార్ చెప్పులు ఇటీవల కనిపించకుండా పోయాయి. ఇంటి గేటు తెరిచి ఉండటంతో లోపలికొచ్చిన కుక్కలు చెప్పులు ఎత్తికెళ్లి ఉండొచ్చని సిబ్బంది అనుమానించారు.

దీంతో, నంద కుమార్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు వీధికుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో మేయర్ నివాసానికి సమీపంలో పట్టుబడ్డ నాలుగు కుక్కలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే, కుక్కలకు సాధారణంగా స్టెరిలైజేషన్ చేస్తూనే ఉంటామని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై మాజీ మేయర్ మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ వార్త మీడియా లో వైరల్ గా మారుతుంది.