అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపనకు నలుగురు శంకరాచార్యులు దూరం

ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారన్న నలుగురు శంకరాచార్యులు

Four Shankaracharyas are far from establishing Ayodhya Ram Temple

అయోధ్యః అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈనెల 22న అట్టహాసంగా జరగనున్న సంగతి తెలిసిందే. కార్యక్రమానికి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 8 వేల మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని నాలుగు మఠాలకు చెందిన నలుగురు శంకరాచార్యులు నిర్ణయించుకున్నారు.

ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారని నలుగురు శంకరాచార్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు వీహెచ్పీ సీనియర్ నేత అలోక్ కుమార్ స్పందిస్తూ… ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శృంగేరి, ద్వారక పీఠాధిపతులు స్వాగతించారని, పూరి శంకరాచార్య కూడా అనుకూలంగా ఉన్నారని చెప్పారు. జ్యోతిర్ పీఠానికి చెందిన శంకరాచార్య మాత్రమే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించారని తెలిపారు.

ఇంకోవైపు శ్రీరాముడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని శృంగేరి పీఠాధిపతి శంకరాచార్య భారతీ తీర్థ స్వామీజీ చెప్పారు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా హరిహరపుర మఠం పీఠాధిపతి శంకరాచార్య సచ్చిదానంద సరస్వతి మాట్లాడుతూ… రాముడి ప్రతిష్ఠ కార్యక్రమం సనాతన ధర్మాన్ని అనుసరించేవారికి ఆనందదాయకమైన విషయంగా అభివర్ణించారు.

కొన్ని రోజుల క్రితం జ్యోతిర్ పీఠం శంకారాచార్య ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ రాముడి విగ్రహాన్ని ముట్టుకుంటే తానేమి చేయాలని ప్రశ్నించారు. తాను నిలబడి చప్పట్లు కొట్టాలా? అని తీవ్రంగా స్పందించారు. శంకరాచార్యులకు సంబంధించిన చర్చ ఓవైపు కొనసాగుతుండగానే… మరోవైపు ఆలయ ప్రతిష్ఠాపనకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరిగిపోతున్నాయి. అయోధ్య పూర్తిగా భద్రతా బలగాల వలయంలోకి వెళ్లిపోయింది.