సొంతగూటికే స్వామిగౌడ్ ..

శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామి గౌడ్‌ తిరిగి సొంత గూటికే వచ్చాడు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టిఆర్ఎస్ ను కాదని వెళ్లిన నేతలు మళ్లీ సొంతగూటికే వస్తున్నారు. ఈరోజు శుక్రవారం బిజెపి పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రావణ్ తో పాటు శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామి గౌడ్‌ టిఆర్ఎస్ లో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు స్వామి గౌడ్ తన రాజీనామా లేఖను కూడా పంపించారు. తెలంగాణ పట్ల బీజేపీ తీరు బాధ కలిగించిందని స్వామిగౌడ్ తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన స్వామిగౌడ్.. పలు అంశాలపై చర్చించారు. ఇక ఉదయం బీజేపేకీ రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌తో పాటు స్వామి గౌడ్ కూడా.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే.. టీఆర్‌పార్టీ కీలక నేతగా ఉన్న స్వామిగౌడ్.. తెలంగాణ ఏర్పడ్డాక తొలి శాసన మండలి ఛైర్మన్‌గా వ్యవహరించారు.

మరోవైపు పాలమూరు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా బీజేపీని వీడనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఆయన టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మళ్లీ సొంతగూటికి రాబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే గురువారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్ కూడా బీజేపీ నుంచి బయటకు వచ్చారు. ఆ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని.. తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు.