నాలుగోసారి ఢిల్లీ సీఎంకు ఈడీ నోటీసులు

ED notice to Delhi CM for the fourth time

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసులో ఆ రాష్ట్ర సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ నాలుగోసారి నోటీసులు జారీ చేసింది. జ‌న‌వ‌రి 18వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆ ఆదేశాల్లో పేర్కొన్న‌ది. జ‌న‌వ‌రి 3వ తేదీన విచార‌ణ‌కు రావాల‌ని ఈడీ ఇచ్చిన నోటీసుల‌ను కేజ్రీ తిర్క‌రించారు. ఆ నోటీసులు అక్ర‌మంగా ఉన్నాయ‌ని, కేవ‌లం త‌న‌ను అరెస్టు చేసేందుకు నోటీసులు ఇచ్చిన‌ట్లు కేజ్రీ పేర్కొన్నారు. గ‌తంలో న‌వంబ‌ర్ 2న‌, డిసెంబ‌ర్ 21వ తేదీన హాజ‌రుకావాల‌ని ఆదేశించారు. కానీ మూడుసార్లూ ఆయ‌న ఈడీ నోటీసుల్ని ప‌ట్టించుకోలేదు.

మ‌ద్యం విధానం కేసులో ఇప్ప‌టికే సీబీఐ ఆయ‌న్ను గ‌త ఏడాది ఏప్రిల్‌లో విచారించింది. కానీ సీబీఐ మాత్రం ఆప్ నేత‌ను నిందితుడిగా పేర్కొన‌లేదు. అయితే తొలిసారి ఈడీ నోటీసులు ఇచ్చిన త‌ర్వాత‌.. కేజ్రీని అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపించాయి. మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఇప్ప‌టికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మ‌నీశ్ సిసోడియా, సంజ‌య్ సింగ్‌, స‌త్యేంద్ర జైన్ అరెస్టు అయ్యారు. ఒక‌వేళ కేజ్రీ అరెస్టు అయినా.. ఆయ‌న జైలు నుంచే బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.