బిజెపిలోకి మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి..?

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాస్త డీలా పడిన తెలంగాణ బిజెపి నేతలు..మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం..నేతలంతా ఇలా డీలా పడితే ఎలా అని అధిష్టానం హెచ్చరించడం తో నేతలంతా మళ్లీ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఇతర పార్టీలలో అసంతృప్తి ఉన్న వారిఫై దృష్టి సారించి..వారికీ ఆఫర్లు ఇస్తూ పార్టీ లో చేర్చుకునే పనిలో పడ్డారు.

తాజాగా మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి తో డీకే అరుణ భేటీ అవ్వడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చ గా మారింది. అతి త్వరలోనే రంగారెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కాషాయం కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడుగా రంగారెడ్డికి పేరుంది. కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొద్ది నెలల క్రితం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన ఆయన.. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయనకు సన్నిహితుగా ఉన్న రంగారెడ్డి కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా రంగారెడ్డి పనిచేశారు. అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వేళ.. రంగారెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతుండడం ఆసక్తికరంగా మారింది.