మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి

బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి 10.10 గంటలకు గుండెపోటు రావడంతో వెంటనే పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా ఉన్న కొప్పుల మహేష్ రెడ్డి ఆయన కుమారుడే. బీఅర్ఎస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల హరీశ్వర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్.. జనంలో ఆధరణ పొందిన సీనియర్ రాజకీయ నాయకులుగా, డిప్యూటీ స్పీకర్ గా ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. హరీశ్వర్ రెడ్డి కుమారుడు మహేష్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రాష్ట్ర విభజనకు ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిగి నియోజకవర్గం నుంచి పలు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొప్పుల హరీశ్వర్ రెడ్డి.. 1999 – 2003 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో డిప్యూటీ స్పీకర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారు. టీడీపీలో ఉన్నప్పటి నుండే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న హరీశ్వర్ రెడ్డి… రాష్ట్ర విభజన అనంతరం 2014 లో సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.