పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరులకు నివాళులు అర్పించిన అమిత్ షా

మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా హాజరయ్యారు. శుక్రవారం రాత్రే అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈరోజు పరేడ్‌ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అమిత్‌షా… జాతీయ జెండాను ఎగురవేశారు.

ఆ తర్వాత సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు. అంతకుముందు అమరవీరులకు నివాళులు అర్పించిన అమిత్ షా… సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌ యూనియన్‌లో కలిసిన 1948 సెప్టెంబర్‌ 17న అప్పటి హోంశాఖమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించగా…. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.

ఇక అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడకలు కొనసాగుతున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నివాళులు అర్పించారు. అనంతరం బండి సంజయ్ జాతీయ జెండా ఎగురవేశారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలిరోజు అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు జరిగాయి. రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తెలంగాణ.. 75వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈరోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం పదిన్నరకు పబ్లిక్‌గార్డెన్‌లో జరిగే ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఇతర ప్రముఖులు జిల్లా కేంద్రాల్లో జెండా వందనం చేస్తారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో 44 కోట్లతో నిర్మించిన ఆదివాసీ, బంజారా భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌ నుంచి ఎన్టీఆర్‌ స్టేడియం వరకు గిరిజనులతో భారీ ర్యాలీ జరుగుతుంది. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు.