భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి వద్ద ప్రస్తుత నీటిమట్టం 43.9 అడుగులు

flood-level-raises-in-godavari-at-bhadrachalam

భద్రాచలం: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి వరద రూపు సంతరించుకుంటోంది. నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.9 అడుగులుగా నమోదైంది. అటు, ధవళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈరోజు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పరిస్థితులు సమీక్షించేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలం చేరుకున్నారు. గోదావరి వరద తీవ్రత తగ్గే వరకు మంత్రి అక్కడే ఉండి అధికార యంత్రాంగాన్ని నడిపించనున్నారు.