ప్రజలపై కరెంట్ చార్జీల పెంపు..మోయలేని భారం : విజయశాంతి

కేసీఆర్ స‌ర్కార్‌కు పోయేకాలం దగ్గర పడింది ..విజయశాంతి

హైదరాబాద్ : బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ స‌ర్కార్‌కు పోయేకాలం దగ్గర పడిందని, అందుకే ప్రజలపై కరెంట్ చార్జీల పెంపుతో మోయలేని భారాన్ని వేసిందని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు పేదల నుండి మధ్య తరగతి వరకు ఎవ్వరినీ వదలకుండా కరెంటు షాక్ ఇచ్చిందని మండిపడ్డారు. గజదొంగల కంటే ఘోరంగా ఉంది ఈ ప్ర‌భుత్వ ప‌నితీరు అని అన్నారు. తెలంగాణ సర్కారు డిస్కమ్‌లకు కట్టాల్సిన రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించలేదన్నారు. డిస్కమ్‌లకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్‌ బకాయిలు రూ.17 వేల కోట్లుండగా అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే రూ.12,598 కోట్లు ఉన్నాయని చెప్పారు. వినియోగదారులు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,603 కోట్లు అని తెలిపారు. అందులో అత్యధికంగా పాతబస్తీకి చెందినవే ఉన్నయ అని పేర్కొన్నారు.

క‌రెంటు చార్జీల పెంపును నిరసిస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టాం అని తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.6 వేల కోట్ల భారాన్ని మోపడం దారుణం అని అన్నారు. ప్రభుత్వం ఒకవైపు తన శాఖలు వాడుకున్న కరెంట్‌కు బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. మరోవైపు పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసే దమ్ము లేదని ఆరోపించారు. ఈ లోటును పూడ్చేందుకు ప్రజలపై భారం మోపడం ఎంత వరకు న్యాయం? అని ప్రశ్నించారు. చార్జీలు త‌గ్గించేవ‌ర‌కు బీజేపీ పోరాటం సాగిస్తుందని విజయశాంతి స్పష్టం చేశారు. ఈ నియంతృత్వ కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే దాకా ప్ర‌జ‌ల త‌రపున కొట్లాడుతాం అని హెచ్చరించారు. నిన్న‌గాక‌ మొన్న‌ ఆర్టీసీ ఛార్జీల పెంపు, నేడు విద్యుత్ ఛార్జీలతోను షాకిచ్చిందన్నారు. ఇలా పేద‌ల‌పై మోయ‌లేని భారాన్ని మోపుతూ పేద‌ల న‌డ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద‌ల‌ను నిత్యం ఇబ్బందుల‌కు గురిచేస్తున్న ఈ ప్ర‌భుత్వాన్ని ప్రజలు సాగ‌నంప‌డం ఖాయం అని విజయశాంతి పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/