ఈగలు, కీటకాలు ఉన్న చీకటి గదిలో ఇమ్రాన్ ఖాన్

ప్రస్తుతం అటోక్ నగరంలోని జైల్లో ఉన్న ఇమ్రాన్

flies-and-bugs-in-imran-khans-jail-room

ఇస్లామాబాద్‌ః తోఫాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు జైలు శిక్షను కోర్టు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అటోక్ నగరంలోని జైల్లో ఉన్నారు. మరోవైపు జైల్లో ఇమ్రాన్ కు దారుణమైన వసతులు కల్పించారని ఆయన తరపు లాయర్ నయీమ్ హైదర్ తెలిపారు. ఇమ్రాన్ ను ఉంచిన గదిలో ఈగలు, కీటకాలు ఉన్నాయని చెప్పారు. ఇమ్రాన్ కు ఒక చిన్న గదిని కేటాయించారని… దానికి ఒక ఓపెన్ బాత్రూమ్ ఉందని తెలిపారు.

అరెస్ట్ సమయంలో తనకు వారంట్ ను కూడా పోలీసులు చూపించలేదని, తన భార్య బుస్రా బీబీ గది తలుపులు పగలగొట్టేందుకు యత్నించారని ఇమ్రాన్ తనతో చెప్పారని లాయర్ తెలిపారు. జైల్లో తనను కలిసేందుకు తన భార్యకు అనుమతిని కోరుతున్నారని చెప్పారు. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. తన క్లయింట్ ఉన్నతమైన కుటుంబంలో జన్మించారని, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారని, పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించారని పిటిషన్ లో తెలిపారు. ఆయన చదువు, అలవాట్లు, సోషల్, పొలిటికల్ స్టేటస్ ను దృష్టిలో ఉంచుకుని ఆయనను అటోక్ జైలు నుంచి అడియాలా జైలుకు తరలించాలని… సీ క్లాస్ వసతులు కాకుండా ఏ క్లాస్ వసతులను కల్పించాలని కోర్టును కోరారు.