అయోధ్య రామయ్య మందిరానికి తయరైన మొదటి బంగారం తలుపు

12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో గర్భగుడి పైఅంతస్తులో అమరిక

First golden door of Ram Mandir installed ahead of Jan 22 inauguration

న్యూఢిల్లీః ఈ నెల 22న అయోధ్య ఆలయంలో రాములవారి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలివుండడంతో సంబంధిత పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఆలయానికి మంగళవారం మొదటి బంగారు తలుపును ఏర్పాటు చేశారు. 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఈ తలుపును గర్భగుడి పైఅంతస్తులో అమర్చారు. రానున్న మూడు రోజుల్లో మరో 13 బంగారం తలుపులను ఏర్పాటు చేయనున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. రామాలయానికి మొత్తం 46 తలుపులు ఏర్పాటు చేయనుండగా వీటిలో నలభై రెండింటికి బంగారు పూత పూయనున్నట్లు వెల్లడించింది.

కాగా, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలతో పాటు 7,000 మందికి పైగా వ్యక్తులకు ఆహ్వానాలు అందాయి. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకాబోతున్నారు. ఇక ఆ రోజున ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండబోవని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే.