తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరగడంతో గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సుమారు 11ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. సెక్రటేరియట్‌లో వుడ్‌ వర్క్స్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ మంటలు చెలరేగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

అయితే ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో ఈ అగ్నిప్రమాదం జరగడంతో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలుసుకుంటున్నారు. మంటలు చెలరేగిన వెంటనే ఎన్ టీఆర్ మార్గ్ రోడ్డును రెండు వైపులా మూసివేశారు. దీంతో ఉదయం పూట వెళ్లే వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి గంటన్నర సమయంలోనే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. కాగా ఈ నెల 17 వ తేదీన తెలంగాణ నూతన సచివాలయం ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

ఈ ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ కుమార్ స్పందించారు. నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురదృష్టకరం అని చెప్పారు. ఆదరా, బాదరా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం అని అన్నారు.

ఫిబ్రవరి 17వ తేదీన కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలన్నారు. పైర్ సేఫ్టీ అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.