కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూశారు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2 తేదీన (గురువారం) రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అపోలో ఆస్పత్రితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ మృతి పట్ల సినీ ప్రముఖులే కాదు రాజకీయ ప్రముఖులు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు శ్రీ కె. విశ్వనాథ్ అని కేసీఆర్ కొనియాడారు. దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులతో సత్కారం వారి దర్శక ప్రతిభకు నిదర్శనమని అన్నారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని కేసీఆర్ అన్నారు.

ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ… విశ్వనాథ్ గారి మరణం తీవ్ర విచారానికి గురి చేసిందని అన్నారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌ గారని కొనియాడారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయని అన్నారు. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ… ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందని చెప్పారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ గారి మృతి తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ట్వీట్ చేశారు. విశ్వనాథ్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కళాతపస్వి మరణించారని తెలిసి తాను ఎంతో దిగ్ర్భాంతి చెందానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. “‘సుప్రసిద్ధ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. కళాతపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. సౌండ్ రికార్డిస్ట్ గా సినీ ప్రస్థానం ప్రారంభించిన శ్రీ విశ్వనాథ్ గారు, దర్శకుడిగా తొలి అడుగునే నంది అవార్డుతో ప్రారంభించారు. భాష, సంస్కృతి, కళలకు పెద్ద పీట వేస్తూ, అగ్రకథానాయకుల్ని సైతం ఆదర్శనీయ పాత్రల్లో చూపిన వారి చిత్రాలు ఆనందాన్ని, సందేశాన్ని అందించి ఆదర్శంగా నిలిచాయి.’’” అని వెంకయ్య చెప్పుకొచ్చారు.