చంద్రబాబు తో మోహన్ బాబు భేటీ..

టీడీపీ అధినేత చంద్రబాబు తో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భేటీ అయ్యారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి స్వయంగా వెళ్లి మోహన్ బాబు కలువడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. చంద్రబాబుతో దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది. చాలా కాలం తర్వాత చంద్రబాబు ఇంటికి మోహన్‌బాబు రావడానికి కారణాలు ఏంటి అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

గతంలో టీడీపీలో ఉన్న మోహన్ బాబు ఆ పార్టీ ద్వారానే తన రాజకీయ కెరీర్ ప్రారంభించారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగారు. ఆ పార్టీ తరపున రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు. ఎంపీ పదవీకాలం ముగిసిన తర్వాత మోహన్ బాబు టీడీపీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వైస్సార్సీపీ పార్టీ కండువా కప్పుకొని, ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఎన్నికల తర్వాత ఎలాంటి పదవి దక్కకపోయినా పార్టీలోనే కొనసాగారు. గత కొంతకాలంగా వైస్సార్సీపీ దూరంగా ఉంటున్నారు. ఇటీవలే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపిన మోహన్ బాబు.. వైస్సార్సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల తిరుపతికి ఓ కేసు విచారణకు హాజరైన సందర్భంగా తాను బీజేపీవ్యక్తినని ప్రకటించి మరో సంచలనానికి తెరలేపారు. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలతో అంత బీజేపీలో చేరడం ఖాయమని అనుకుంటూ వచ్చారు. ఇంతలోనే ఆయన స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఇప్పుడు మరో చర్చ కు దారితీసింది.