కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం..ముగ్గురి సజీవదహనం

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల స్వప్నలోక్ కాంప్లెక్స్, శాస్త్రీపురం, నాచారంలో జరిగిన వరుస అగ్నిప్రమాద ఘటన మరువక ముందే తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగి..ముగ్గురి సజీవదహనం అయ్యారు.

కుషాయిగూడ పోచమ్మ టెంపుల్ వద్ద ఉన్న టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానికులు ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించడం తో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో టింబర్ డిపోలో అంటుకున్న మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి. అందులో నివసిస్తున్న దంపతులు, వారి చిన్న కుమారుడు తప్పించుకునే మార్గం లేక మంటల్లో చిక్కుకుని మరణించారు. దంపతుల మరో చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్ (35), సుమ (28), జోషిత్ (5)గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.