వివేకా హత్య కేసు : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ (CBI) అధికారులు అరెస్టు చేశారు. ఏప్రిల్16వ తేదీ తెల్లవారుజామున వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి ఉంటున్న పులివెందులలోని ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అక్కడ ఆయన్ను విచారించిన తర్వాత కడపకు తీసుకెళ్లారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయాన్ని ముందుగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అరెస్ట్ మెమోను భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మీకి అందజేశారు సీబీఐ అధికారులు. భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 120B, రెడ్ విత్ 302, 201 కేసులు నమోదు చేశారు.

ఈరోజు మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ముందు వైఎస్ భాస్కర్ రెడ్డిని హాజరు పరుస్తామని సీబీఐ అధికారులు తెలియజేశారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని చెబుతున్నారు. వివేకా హత్య కు ముందు, తరువాత నిందితులను భాస్కర్ రెడ్డి తమ ఇంటికి పిలిపించి మాట్లాడారని – సీబీఐ అధికారులు పేర్కొన్నారు. సాక్ష్యులుగా వైఎస్ లక్ష్మీ, పీ జనార్దన్ రెడ్డిని చేర్చారు. ప్రస్తుతం అవినాష్‌రెడ్డి హైదరాబాద్ లో సీబీఐ అధికారుల అదుపులో ఉన్నాడు. ఇటీవల అవినాష్‌రెడ్డి అనుచరుడు ఉదయ్‌ కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.