‘హరి హర వీరమల్లు’ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం..

‘హరి హర వీరమల్లు’ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. గతంలో బౌరంపేటలో వేసిన సెట్ వర్షానికి కూలిపోవడంతో దానికి మరమ్మత్తు చేస్తున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేశారు.

క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్పుడెప్పుడో మొదలైంది. కానీ రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. ఈ తరుణంలో ఈ చిత్రానికి తాజాగా పవన్ డేట్స్ ఇచ్చారు. హైదరాబాద్ శివారులోని దుండిగల్ ప్రాంతంలో సెట్ వేశాడు. అయితే కొన్నిరోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఆ సెట్ పాక్షికంగా పాడైంది. ఇప్పుడు దాన్ని బాగు చేస్తూ మొత్తానికి రెడీ చేసేశారు. కానీ ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సెట్ దగ్గరకు చేరుకుని మంటలను అయితే ఆర్పేశారు. కానీ సెట్ బాగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది అనేది మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొగల్ కాలం నాటి స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో పవన్.. ఓ వజ్రాల దొంగగా నటిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్. కీరవాణి సంగీతమందిస్తున్నారు.