అచ్యుతాపురం సాహితీ ఫార్మాలో పేలుడు..ఇద్దరు మృతి

భారీ శబ్దాలు రావడంతో పరుగులు పెట్టిన ఉద్యోగులు, కార్మికులు

fire-accident-in-atchutapuram-sez

అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో ఘటనాస్థలిలో మంటలు ఎగసిపడుతున్నాయి. రియాక్టర్లు భారీ శబ్దంతో పేలినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరికొందరు గాయాలతో బయటపడినట్టు సమాచారం.

భారీ శబ్దాలు రావడంతో ఉద్యోగులు, కార్మికులు, స్థానికులు భయంతో దూరంగా పరుగులు పెట్టారు. ఘటన గురించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. మరికొన్ని ఫైరింజన్లను రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గత జనవరిలో కూడా లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.