మణిపూర్‌ హింసా.. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయనున్నబీరేన్‌ సింగ్

Manipur Violence: CM Biren Singh likely to resign today

న్యూఢిల్లీ : మ‌ణిపూర్‌లో హింసాకాండ కొన‌సాగుతుంది. ఈ అల్ల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కూ వంద మందికి పైగా మ‌ర‌ణించ‌డంతో శాంతిభ‌ద్ర‌త‌ల వైఫ‌ల్యానికి బాధ్య‌త వ‌హిస్తూ సీఎం ఎన్ బీరేన్‌ సింగ్ తన ప‌ద‌వికి మ‌రికాసేప‌ట్లో రాజీనామా చేస్తార‌ని భావిస్తున్నారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్ అన‌సూయ యుకీకి రాజీనామా పత్రాన్ని స‌మ‌ర్పిస్తార‌ని తెలిసింది. బీరేన్‌ సింగ్ రాజీనామా చేయాల‌ని లేకుంటే కేంద్ర ప్ర‌భుత్వం రంగంలోకి రాష్ట్రంలో ప‌రిస్ధితిని చ‌క్క‌దిద్దుతుంద‌ని సింగ్ ఎదుట కేంద్రం రెండు ఆప్ష‌న్ల‌ను ముందుంచింద‌ని స‌మాచారం.

కాగా, బిరెన్ సింగ్ మ‌ణిపూర్ అల్ల‌ర్ల నేప‌ధ్యంలో రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్ధితుల‌ను వివ‌రించేందుకు ఈనెల 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. క్షేత్ర‌స్ధాయిలో ప‌రిస్ధితిని అమిత్ షాకు ఈ స‌మావేశంలో వివ‌రించాన‌ని బిరెన్ సింగ్ తెలిపారు. మైతీ, కుకీ తెగ‌ల మ‌ధ్య చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌ల‌తో మణిపూర్ అట్టుడుకుతోంది. మ‌రోవైపు మణిపూర్‌ లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ హింసకు ఇప్పుడప్పుడే తెరపడేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. తాజాగా మరోసారి అక్కడ హింస చెలరేగింది.

మరోవైపు ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తుండగా ముఖ్యమంత్రికి మద్దతుగా పెద్ద సంఖ్యలో మహిళలు శుక్రవారం నుపి లాల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని, ఈ సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయవద్దని బిరేన్ సింగ్‌ను డిమాండ్ చేశారు.