SR నగర్ లోని అమూల్ ఐస్ క్రీమ్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం

SR నగర్ లోని అమూల్ ఐస్ క్రీమ్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గత నాల్గు రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం నల్లగుట్ట లోని డెక్కన్ షో రూమ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి , ముగ్గుర్ని బలి తీసుకుంది. ఈ ఘటన గురించి ఇంకా నగరవాసులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక మొన్న రాత్రి నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్ పార్కింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవిచింది. కాగా.. మళ్లీ నిన్న హకీంపేటలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. హకీంపేట్ సాలార్జంగ్ బ్రిడ్జ్ ఏరియాలో వరుసగా గ్యాస్ సిలిండర్లు పేలాయి.

ఇక ఈరోజు SR నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంగళరావునగర్ కాలనీలో ఉన్న అమూల్ ఐస్ క్రీమ్ గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ విషయం తెలియగానే అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున మంటలు గోడౌన్ లో వ్యాపించడంతో ఆర్పేందుకు కాస్త కష్టతరమైంది. జనావాసాల మధ్యన ఉన్న గోడౌన్ లో ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేదని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది త్వరగా చేరుకొని మంటలను అదుపు చేయడంతో ఎటువంటి ప్రాణానష్టం జరగలేదు. ఇలా వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం తో స్థానికులు ఖంగారు పడుతున్నారు.