భువనగిరి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత : తండ్రి, కొడుకు ఆత్మహత్యాయత్నం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కలెక్టర్ ఛాంబర్ ముందు తండ్రి, కుమారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే ..

ఆలేరు మండలం కొలనుపాకలో తమకు 4 ఎకరాల భూమి ఉందని ఉప్పలయ్య అనే వ్యక్తి తెలిపారు. 20 ఏళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని రూ.6వేలకు కొనుగోలు చేశానని చెప్పారు. అయితే తనకు ఇప్పటికీ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వలేదని ఉప్పలయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాలకు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంతో మనస్తాపం చెంది సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో ఉప్పలయ్య, అతడి కుమారుడు మహేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే, అడ్డుకున్నారు. అక్కడే ఉన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.