మళ్లీ కరోనా ఉద్ధృతి .. డెల్టా లేదంటే మరో కొత్త వేరియంట్

ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

జెరూసలేం : ఈ ప్రపంచంపై విరుచుకుపడేందుకు కరోనా వైరస్ మళ్లీ పొంచి చూస్తోందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకాలు వచ్చే రెండుమూడు నెలల్లో వాటంతట అవే కనుమరుగవుతాయని శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు డెల్టా, లేదంటే మరో కొత్త వేరియంట్ మాత్రం వెలుగు చూసి ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని బెన్‌ గురియన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. బీర్‌ షెవా నగరంలోని మురుగునీటిని సేకరించి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల మధ్య పరస్పరం చర్య జరుగుతున్నట్టు గుర్తించారు.

డెల్టా వేరియంట్ రాకతో అంతకుముందున్న వైరస్ రకాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. అయితే, డెల్టా తర్వాత వచ్చిన ఒమిక్రాన్ మాత్రం డెల్టా వేరియంట్‌పై ప్రభావం చూపించలేకపోయింది. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్లు మరో రెండు మూడు నెలల్లో వాటంతట అవే తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని, డెల్టా మాత్రం రహస్యంగా దాని పని అది చేసుకుపోతున్నట్టు వివరించారు.

అంతేకాదు, అది మరింత శక్తిమంతంగా మారే అవకాశం కూడా ఉందన్నారు. లేదూ అంటే మరో కొత్త వేరియంట్‌ పుట్టుకకు అది దారితీసే అవకాశం కూడా ఉందని అన్నారు. నిజానికి డామినెంట్ వేరియంట్లు ఎప్పుడూ వాటికంటే అధికశక్తి కలిగి ఉంటాయన్నారు. ఈ లెక్కన చూసుకుంటే డెల్టా లేదంటే మరో కొత్త వేరియంట్ కారణంగా కొవిడ్ మళ్లీ చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్నట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఏరియెల్ కుష్మారో తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/