పంజాబ్‌లో అన్న‌దాత‌ల రైల్ రోకో

farmers-rail-roko-protest-in-punjab

న్యూఢిల్లీ : డిమాండ్ల సాధ‌న కోసం పోరుబాట ప‌ట్టిన రైతులు కేంద్ర ప్ర‌భుత్వంతో తాజా చ‌ర్చ‌ల‌కు ముందు గురువారం పంజాబ్‌లో రైలో రోకో నిర్వ‌హించారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌డంతో పాటు ఇత‌ర డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ పంజాబ్‌, హ‌రియాణలో రైతులు ఆందోళ‌న‌ను తీవ్రత‌రం చేశారు. రైతుల నిర‌స‌న‌ల‌తో పంజాబ్ స‌రిహ‌ద్దు స‌హా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఫిబ్ర‌వ‌రి 16 రాత్రి వ‌ర‌కూ హ‌రియాణ ప్ర‌భుత్వం ఇంట‌ర్‌నెట్ సేవ‌ల‌ను నిలిపివేసింది. రైతుల ఛ‌లో ఢిల్లీ ప్ర‌ద‌ర్శ‌నలో భాగంగా రైతులు ఎక్క‌డికక్క‌డ బారికేడ్ల‌ను ధ్వంసం చేసి ముందుకు సాగుతుండ‌టంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఢిల్లీ చ‌లో మార్చ్ సాగుతుండ‌గా కేంద్ర ప్ర‌భుత్వం, రైతు సంఘాల నేత‌లు మూడో ద‌శ చర్చ‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. నిర‌స‌న‌కు దిగిన రైతు సంఘాల ప్ర‌తినిధుల‌తో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయ‌ల్‌, నిత్యానంద్ రాయ్ గురువారం సాయంత్రం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నారు.