అరుదైన రికార్డు సృష్టించిన దేవెగౌడ కుటుంబం

నాలుగు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలోనే ఏకైక కుటుంబంగా రికార్డు

బెంగళూర్: జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డు సృష్టించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవెగౌడ పెద్ద కుమారుడైన రేవణ్ణ తనయుడు సూరజ్ రేవణ్ణ హసన్ నుంచి విజయం సాధించారు. ఫలితంగా పార్లమెంటుతోపాటు కర్ణాటక ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కుటుంబంగా అవతరించింది. దేవెగౌడ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, ఆయన చిన్న కుమారుడు కుమారస్వామి చెన్నపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. సూరజ్ సోదరుడు ప్రజ్వల్ ఎంపీగా కొనసాగుతుండగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో సూరజ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

సూరజ్ తండ్రి రేవణ్ణ హొలెనర్సిపుర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, తల్లి భవాని జిల్లా పరిషత్ సభ్యురాలు. మాజీ ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి భార్య అనిత రామనగర నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి కుమారుడు నిఖిల్ జేడీఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఫలితంగా ఒకే కుటుంబ నుంచి లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, విధాన పరిషత్‌.. ఇలా నాలుగు చట్టసభలకు ప్రాతనిధ్యం వహిస్తున్న దేశంలోని ఏకైక కుటుంబంగా దేవెగౌడ కుటుంబం రికార్డులకెక్కింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/