నేడు టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే వలసలు మొదలయ్యాయి. ముఖ్యముగా టీడీపీ లోకి పెద్ద ఎత్తున నేతలు చేరుతున్నారు. రీసెంట్ గా బిజెపి నేత కన్నా లక్ష్మి నారాయణ టీడీపీ కండువా కప్పుకోగా..తాజాగా ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈరోజు నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు.ఈ సందర్భంగా ఆయన అనుచరులు కొంతమంది టీడీపీలో చేరున్నారు. షాజహాన్ బాషా చేరికతో మదనపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అవుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.

వైఎస్‌కు అత్యంత ఆప్తుడిగా షాజహాన్ బాషా పేరు తెచ్చుకున్నారు. 2009లో కాంగ్రెస్ తరపున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చతికిలపడటంతో.. ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కాగా మూడు నెలల క్రితం ఏఐసీసీలో కీలక సభ్యుడిగా ఆయనకు ఢిల్లీ హైకమాండ్ అవకాశం కల్పించింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేకపోవడంతో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు అనుచరుల నిర్ణయంతో టీడీపీ లో చేరేందుకు డిసైడ్ అయ్యారు. షాజహాన్ బాషా సోదరుడు నవాజ్ బాషా ప్రస్తుతం మదనపల్లె వైస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో రాజకీయంగా ఇద్దరూ ప్రత్యర్థులుగా మారారు. సోదరుడిని ఎదుర్కొనేందుకు ఇప్పుడు షాజహాన్ బాష టీడీపీలోకి వస్తున్నట్లు అంత మాట్లాడుకుంటున్నారు.