కొచ్చర్‌ దంపతులకు బాంబే హైకోర్టులో చుక్కెదురు

Chanda Kochhar
Chanda Kochhar

ముంబయిః వీడియోకాన్‌ రుణ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ అత్యవసర విచారణ జరపాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. జనవరి 2వ తేదీన సాధారణ విచారణ కోసం కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్ ధూత్‌ నిందితులుగా ఉన్నారు. చందా కొచ్చర్‌ సీఈవోగా ఉన్నప్పుడు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వీడియోకాన్‌ కంపెనీ రూ.3,200 కోట్లకుపైగా లోన్‌ తీసుకుంది. ఈ లోన్‌ మంజూరు సమయంలో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

దాంతో వీరిద్దరినీ ఈనెల 23న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రత్యేక కోర్టు మూడు రోజుల రిమాండ్‌ విధించింది. అదనపు గడువు కోరుతూ సీబీఐ అప్పీల్‌ చేసింది. దీంతో కొచ్చర్‌ దంపతులకు 28 వరకు రిమాండ్‌ పొడిగించింది. అయితే, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద సీబీఐ అరెస్ట్‌ అక్రమమని పేర్కొంటూ.. చందా కొచ్చర్‌ దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/