తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలిః మంత్రి శ్రీధర్ బాబు

విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామికవేత్తల సహకారం అవసరమన్న మంత్రి

Everyone should be involved in the development of Telangana: Minister Sridhar Babu

హైదరాబాద్ః రష్యాలాంటి దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లోని హోటల్ ఐటీసీ కాకతీయలో నిర్వహించిన సీఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దావోస్ పర్యటనలో మౌలిక వసతులపై చర్చించామని, సుస్థిరమైన విధానాలతో రియాల్టీ రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామికవేత్తల సహకారం కూడా అవసరమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలకు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? అని ఎన్నికల సమయంలో మాట్లాడుకున్నారని, కానీ మేం గెలిచి చూపించామని వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో కాంగ్రెస్ మూసీ నదిని ప్రక్షాళణ చేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారని… కానీ మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఆరు గ్యారెంటీలను తాము కచ్చితంగా అమలు చేస్తామన్నారు. మూడు దశాబ్దాలుగా రియాల్టీ రంగం ఎంతో పుంజుకుందన్నారు. ఇప్పుడు ప్రతి రాష్ట్రం హైదరాబాద్ వైపు చూస్తోందన్నారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.