ఆ నలుగురూ కలిసి వచ్చినా వైఎస్‌ఆర్‌సిపిని ఓడించలేరుః తమ్మినేని

సీఎంగా మూడుసార్లు చేసినా చంద్రబాబు ఏమీ చేయలేదని విమర్శ

Even if all four come together they cannot defeat YSRCP: Tammineni

అమరావతిః ఏపీలో ఇప్పటికే టిడిపి, జనసేన పొత్తులో ఉన్నాయి. వీరితో బిజెపి కలుస్తుందా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు, ఏపీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన అన్న సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, షర్మిల, బిజెపి కలిసి వచ్చినా వైఎస్‌ఆర్‌సిపిని ఓడించలేరని… మళ్లీ సీఎం జగనే అని తమ్మినేని చెప్పారు. చంద్రబాబుకు మూడు సార్లు సీఎంగా అవకాశమిచ్చినా ఆయన ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. మరో అవకాశం ఇవ్వాలని ఎందుకు అడుగుతున్నావు చంద్రబాబూ? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబానికి మేలు జరిగిందని భావిస్తే… తమకు మరోసారి ఓటు వేయండని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని చెప్పారు. జగన్ ఇచ్చిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.