6 నెలల కాలంలోనే ప్రజలతో ఛీకొట్టించుకున్న ఒకే ఒక సీఎం: రేవంత్ రెడ్డి

Etela Rajender

హైదరాబాద్ః కేవలం 6 నెలల కాలంలోనే ప్రజలతో ఛీకొట్టించుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నా… కానీ అంతా వట్టిదేనని ఎద్దేవా చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండలో ఆయన మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉంది? అనే వారికి బుద్ధి చెబుతామన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పాలని ఎద్దేవా చేశారు.

బీజేపీ పాలనలో ఒక్క కుంభకోణం కూడా లేదన్నారు. స్కాంలలో ఒక్క బీజేపీ మంత్రీ అరెస్ట్ కాలేదని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో అన్నీ కుంభకోణాలేనని… ఎంతోమంది మంత్రులు జైలుకు వెళ్లారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయన ఎవరిని ప్రశ్నిస్తాడో చెప్పాలన్నారు. కొన్నిసార్లు రాజకీయాల్లో ఊహించని ఫలితాలు వస్తాయని… 2018లో తాను మంత్రిగా ఉన్నానని… బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని… కానీ ఆ తర్వాత మూడు నెలల కాలంలోనే 2019 లోక్ సభ ఎన్నికల్లో అదే బండి సంజయ్ లక్ష మెజార్టీతో గెలిచారన్నారు. ఇది బీజేపీకి మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఏ సర్వే సంస్థలూ ఊహించని విధంగా బీజేపీ బలపడిందన్నారు.

అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. అవినీతికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న పోటీయే ఈ ఎన్నికలు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య కుమ్ములాటలు తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు.