ట్రంప్ ట్విటర్ ఖాతాను మ‌ళ్లీ తెరుస్తా : ఎల‌న్ మ‌స్క్

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. 2020 జ‌న‌వ‌రి 6 వ తేదీన క్యాపిట‌ల్ హిల్‌పై దాడి త‌ర్వాత ట్రంప్ అకౌంట్‌ను ట్విట్ట‌ర్ సంస్థ సీజ్ చేసింది. అయితే మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ ఖాతాను మ‌ళ్లీ తెరుస్తాన‌ని బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్ తెలిపారు. ట్విట్ట‌ర్ సంస్థ‌ను కొనుగోలు చేసేందుకు మ‌స్క్ ఆస‌క్తిగా ఉన్న విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియా సంస్థ ట్విట్ట‌ర్‌ను 44 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు కొనేందుకు మ‌స్క్ ఆఫ‌ర్ ఇచ్చారు.

అయితే ట్రంప్ ఖాతాకు 8.8 కోట్ల మంది పాలోవ‌ర్లు ఉన్నారు. క్యాపిట‌ల్ హిల్ దాడి త‌ర్వాత ట్రంప్ అకౌంట్‌ను ప‌ర్మ‌నెంట్‌గా నిషేధించారు. హింస‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌మాదం ఉంద‌న్న నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ సంస్థ ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ట్విట్ట‌ర్ మీద ఉన్న కోపంతో ట్రంప్ కొత్త సోష‌ల్ మీడియా సంస్థ‌ను స్థాపించాడు. ట్రుత్ సోష‌ల్ మీడియా యాప్‌ను వాడ‌నున్న‌ట్లు ట్రంప్ గతంలో తెలిపారు. అయితే తాజ‌గా మ‌స్క్ ఇచ్చిన ఆఫ‌ర్‌పై మాత్రం ట్రంప్ ప్ర‌తినిధి ఇంకా స్పందించ‌లేదు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/