బీఆర్‌ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. అలాగే బీఆర్‌ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసారు. ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహలపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించాలని, హాజరుకావొద్దని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎడగట్టాలని ఎంపీలకు కేసీఆర్ తెలిపారు.
దాదాపు 4 గంటల పాటు జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు పలు సూచనలు చేశారు కేసీఆర్. తెలంగాణ హక్కులపై పార్లమెంటులో గొంతెత్తాలని సూచించారు. రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రజాసమస్యలపై గళమెత్తాలని సీఎం కేసీఆర్ సూచించారు. కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. బీఆర్‌ఎస్‌తో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఉభయసభల్లో నిలదీయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
బీజేపీ విధానాలు దేశ సమగ్రతకు ఆటంకంగా మారాయని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపదను కార్పొరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారని అన్నారు. ఎల్‌ఐసీ వాటాలను అదానీ వంటి వ్యాపారవేత్తలకు అప్పగించారని.. వాటి షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతున్నాయని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థకు కేంద్రం తూట్లు పొడుస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తుందని.. కేబినెట్, అసెంబ్లీ నిర్ణయాలను బేఖాతరు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలపై ఎప్పటిలాగే రాజీలేని పోరాటం చేయాలని సూచించారు.