లాకప్‌లోనే కేజ్రీవాల్‌.. 10 రోజులు కస్టడీ కోరే అవకాశం!

ed-wants-to-ask-kejriwal-custody-for-10-days-in-delhi-liquor-scam-case

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే గడిపారు. రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్‌ను 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనున్నట్టు తెలుస్తోంది.

కాగా, కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ పరిసరాల్లో భద్రతను భారీగా పెంచారు. కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. ఈడీ కార్యాలయం వెలుపల కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ పిలుపునిచ్చిన ఆందోళనల్లో ఇండియా కూటమి పార్టీలు కూడా పాల్గొనే అవకాశాలున్నాయి.