కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో కేసు నమోదు చేసింది. శనివారం ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ రౌన్ ఎవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ అనంతరం కేజ్రీవాల్ పై ఈడీ కొత్త కేసు నమోదు చేసింది.

దిల్లీ జల మండలిలో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇలా కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం వరుసగా తొమ్మిదోసారి. గతంలో దిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసింది. వీటికి ఆయన స్పందించకపోవడంతో దిల్లీ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ కోర్టు ముందు హాజరయ్యారు. చీఫ్‌ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. మరుసటి రోజే తాజాగా మరో కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది.