బై.. బై మోదీ..సాలు మోదీ అంటూ హైదరాబాద్ లో వెలసిన ప్లెక్సీలు

హైదరాబాద్ లో మరో రెండు రోజుల్లో బిజెపి జాతీయ కార్య వర్గ సమావేశాలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు 18 రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ కార్యవర్గ పదాధికారులు, వివిధ మోర్చాల అధినేతలు హాజరుకాబోతున్నారు. ఈ సమావేశాలను తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతిష్ట్మాకంగా తీసుకున్నారు. ఇప్పటికే దీనికి సంబదించిన ఏర్పట్లు పూర్తి అవుతున్నాయి.

జూలై 2,3 తేదీల్లో మాదాపూర్ లో హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల సందర్భంగా రెండు రోజులు హైదరాబాద్ లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఉండనున్నారు. అయితే ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్న సమయంలో నగరంలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ సమావేశాల్లో భాగంగా జూలై3న సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాదాపు 10 లక్షల మందిని సమీకిరంచడానికి తెలంగాణ కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ చుట్టే దర్శనమిస్తున్నాయి. సాలు మోడీ సంపకు మోడీ అని దానిపై రాసి ఉంది. రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు పెట్టారని తెలుస్తోంది. ఎవరు వేశారో తెలియకుండా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.

గత కొన్ని రోజులుగా అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్దం సాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య సోషల్ వార్ కూడా ఓ రేంజ్ లో నడుస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావడంతో వార్ మరింత ముదిరింది. బీజేపీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు వివాదం అగ్గి రాజేస్తోంది. సీఎం కేసీఆర్ పతనం మొదలైందంటూ “సాలు దొర.. సెలవు దొర” పేరుతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారు. అదే పేరుతో వెబ్ సైట్ కూడా ప్రారంభించారు. డిజిటల్ బోర్డు ఏర్పాటుపై గులాబీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా తాము కూడా బోర్డులు పెడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం చర్చగా మారింది. ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది ఎవరో ఇంకా తెలియనప్పటికి.. ఇదే టీఆర్ఎస్ నేతల పనేనని తెలంగాణ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక నగరం అంత కూడా బిజెపి , తెరాస నేతలు వరుస కటౌట్లు , ప్లెక్సీ లు ఏర్పాటు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు.