ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్ట్

ఈడీ అదుపులో హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై

ed-arrests-arun-pillai-in-delhi-liquor-scam

హైదరాబాద్‌ః ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పది మంది అరెస్టు కాగా తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైని సోమవారం విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. రాత్రి పదకొండు గంటలకు పిళ్లైని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 11 కు చేరింది. త్వరలో ఇంకొందరిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం.

లిక్కర్ స్కామ్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే! సోమవారంతో కస్టడీ ముగియగా అధికారులు సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. పోలీసులు సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. సిసోడియాను విచారించేందుకు ఈడీ అధికారులు ఇప్పటికే కోర్టు అనుమతి తీసుకున్నారు. మంగళవారం సిసోడియాను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, మనీలాండరింగ్ కేసును సవాల్ చేస్తూ శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.