రాయ్‌గ‌ఢ్‌లో 10కి చేరిన మృతుల సంఖ్య

మృత్యుంజయుడిగా తిరిగొచ్చిన ఐదేళ్ల బాలుడు

Raigad-Building-Collapse

ముంబయి: మ‌హారాష్ట్రలోని రాయ్‌గ‌డ్ జిల్లాలో భ‌వ‌నం కూలిన ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతున్న‌ది. తాజా మ‌రో రెండు మృత‌దేహాలు ల‌భ్యం కావ‌డంతో ఈ ఘ‌ట‌న‌లో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. క్ష‌తగాత్రుల సంఖ్య 20 దాటింది. భ‌వ‌నం శిథిలాల కింద సుమారుగా 75 మంది చిక్కుకున్నట్లు గుర్తించి శిథిలాల తొల‌గింపు మొద‌లుపెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు మృతులు, క్ష‌త‌గాత్రులు క‌లిపి మొత్తం 60 మందిని వెలికితీశారు. మిగ‌తావారి ఆచూకీ కోసం ఇంకా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. రాయ్‌గ‌డ్ జిల్లాలోని మ‌హ‌ద్ త‌హ‌సిల్‌లో ఐదంత‌స్తు భ‌వ‌నం కుప్ప‌కూలింది. స్థానికులు ఇచ్చిన స‌మాచారంతో వెంట‌నే ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న అధికారులు, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

కాగా ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు మృత్యుంజయుడిగా తిరిగొచ్చాడు. భవనం కూలిన తర్వాత శిథిలాల కిందే చిక్కుకుపోయిన బాలుడు.. దాదాపు 18గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగించి ఆ బాలుడిని కాపాడారు. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రంతా భయం భయంగా ఉన్నానని.. నీళ్ల కోసం అల్లాను వేడుకున్నానని ఆ బాలుడు తెలిపాడు. అతడు ప్రాణాలతో తిరిగి రావడం అద్భుతమని.. మిగతా వారు కూడా ఇలాగే బయటపడాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/