ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం 4.0 తీవ్రత‌తో భూకంపం

earthquake

న్యూఢిల్లీః ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌ లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈరోజు ఉదయం 9:11 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్‌ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. పితోర్‌ఘర్‌ కు ఈశాన్యంగా 48 కి.మీ దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

కాగా, ఇటీవలే నేపాల్‌లో 6.2 తీవ్రత‌తో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో వరుసగా భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ, పంజాబ్‌, హ‌రియాణ‌, యూపీ స‌హా ఉత్తరాదిలోని ప‌లు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా దేశ రాజ‌ధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ రీజియ‌న్‌లో భూప్రకంప‌న‌లు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 3.1గా నమోదైంది. హ‌రియాణ‌లోని ఫ‌రీదాబాద్‌కు తొమ్మిది కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంద‌ని అధికారులు తెలిపారు.