ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్‌ సీఆర్‌ రావు ఇకలేరు

ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ సిఆర్ రావు(102) కన్నుమూశారు. అమెరికాలో డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణారావు తుదిశ్వాసవిడిచారు. గణిత శాస్త్రంలో అందించిన సేవలకు గానూ స్టాటిస్టిక్స్‌ (statistics) రంగంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. భారత్‌ ప్రభుత్వం ఆయన్ను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 1968లో పద్మ భూషణ్, 2001లో పద్మవిభూషణ్, ఎస్‌ఎస్ భట్నాగర్ పురస్కారాలను సహితం అందుకున్నారు.

1920లో కర్నాటకలోని హడగల్లి ప్రాంతంలో తెలుగు కుటుంబంలో రావు జన్మించారు. ఆయన గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో చదువుకున్నారు. 1943లో ఎంఎస్ మ్యాథ్స్ ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశారు. కోల్‌కతా యూనివర్సిటీలో ఎంఎలో స్టాటిస్టిక్స్ చేశారు. యుకెలో పిహెచ్‌డి చదివారు. స్టాటిస్‌టిక్స్ రంగంలో నోబెల్ బ‌హుమ‌తిగా కీర్తించ‌బ‌డే ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్‌టిక్స్‌ను ఆయ‌నను వరించింది.

హైదరాబాద్‌లోని సీఆర్‌ రావు అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ వ్యవస్థాపకులైన ఆయన సేవలు కేవలం స్టాటిస్టికల్‌ రంగానికే కాకుండా ఎకనమిక్స్‌, జెనెటిక్స్‌, ఆంత్రోపాలజీ తదితర రంగాలకూ విశేషంగా ఉపయోగపడినట్లు ఇటీవల వెబినార్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్న ఆయన ఇప్పటివరకూ 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ పురస్కారం అందుకున్నారు.