ఈడీ కాకపోతే బోడీ తెచ్చుకో..మోడీ ఫై కేసీఆర్ నిప్పులు

మునుగోడు సభ లో సీఎం కేసీఆర్ మరోసారి మోడీ ..అమిత్ షా లపై నిప్పులు చెరిగారు. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోయాలని చూస్తున్నారు. ఈడీని పంపిస్తామని బెదిరిస్తున్నారు. ఈడీ కాకపోతే బోడీ తెచ్చుకో అని కేసీఆర్ తనదైన శైలి లో విమర్శించారు.

రైతులకు అనవసరంగా డబ్బులు పంచిపెడుతున్నామని బిజెపి నేతలు నిలదీశారు. రైతుబంధు, పింఛన్లు ఎందుకు ఇస్తున్నారని మమ్మల్ని నిలదీశారు. రైతుబంధు, రైతు బీమాలాంటి పథకాలు బంద్‌ పెట్టాలని అంటున్నారు. మీటర్లు పెట్టమనే బిజెపి కావాలా, మీటర్లు వద్దనే టిఆర్ఎస్ కావాలా అని కేసీఆర్ సభ ముఖంగా ప్రశ్నించారు. మునుగోడులో బిజెపి ని గెలిపిస్తే రేపు మోటార్లకు మీటర్లు పెట్టడం ఖాయమన్నారు.

మన రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు అవుతోంది. అయ్యా.. ఈ కృష్ణా నదిలో మా వాటా తేల్చండి అని అడిగితే సమాధానం చెప్పరు. ఎన్ని ఇస్తే అన్నే ఇవ్వు. కానీ వాటా చెప్పు అంటే నరేంద్ర మోదీ చెప్పడు. మా నీళ్లలో వాటా ఇవ్వనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా అమిత్ షా? సమాధానం చెప్పు. నీ బొమ్మలు కాదు. నీ తాత జేజమ్మల బొమ్మలు కూడా మేం చూశాం. కొట్లాటలు తెలంగాణకు కొత్త కాదు. కొట్లాట మొదలైతే ఎంత దూరమైనా పోతాం. ఇలాంటి బొమ్మలు కాదు. ఎందుకు కృష్ణా జలాల్లో మా వాటా తేల్చడం లేదు? సమాధానం చెప్పు’’ అని అమిత్‌షాను ప్రశ్నించారు.

రేపు డోల్ బాజా పట్టుకొని అమిత్‌షాను తీసుకొస్తారట. ఎవడికి కావాలి నీ డోల్ బాజా, భజంత్రీ, నీ పెద్దపెద్ద బొమ్మలు? మునుగోడు చైతన్యవంతమైన గడ్డ. కృష్ణా జలాల వాటా ఎందుకు తేల్చరో? కేంద్ర ప్రభుత్వ పాలసీ ఏంటో? మీ దద్దమ్మ చేతగానితనమేంటో మునుగోడులో చెప్పాలని కేసీఆర్ సవాల్ విసిరారు.