జీవితంలో ఇలాంటి గెలుపోటములు సహజమే: శశిథరూర్

shashi-tharoor
shashi-tharoor

న్యూఢిల్లీ : ఎంపీ శశిథరూర్ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి, ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాను ఓడిపోయినందుకు బాధపడడం లేదని స్పష్టం చేశారు. అయినా ముందు నుంచీ ఖర్గేకు పార్టీ మద్దతు ఇస్తోందన్న ఆయన.. అందులో తనకు తప్పేమీ కనిపించలేదని చెప్పారు. అయినా జీవితంలో ఇలాంటి గెలుపోటములు సహజమేనని చెప్పుకొచ్చారు. పార్టీ ముందు ఒకలా, మీడియా ముందు మరోలాగా శశి థరూర్ వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల ఎన్నికల ప్రెసైడింగ్ అధికారి మధుసూధన్ మిస్త్రీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు సమాధానంగా శశి థరూర్ తాజాగా బదులిచ్చారు.

పార్టీలోని చాలా మంది సభ్యులు తమకు మద్దతు ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదని శశి థరూర్ చెప్పారు. అయితే ముందు నుంచే పార్టీలోని చాలా మంది ఖర్గేకు సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందేనని, అయినా దాంట్లో తప్పేం కనిపించలేదని తెలిపారు. రిజల్ట్ అనంతరం తాను సోనియా గాంధీతోనూ మాట్లాడానని స్పష్టం చేశారు. ఖర్గేకు శుభాకాంక్షలు కూడా తెలియజేశానన్నారు. ఇదిలా ఉండగా 24ఏళ్ల తర్వాత మొదటిసారి జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మల్లిఖార్జున ఖర్గే విజయం సాధించారు. ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశి థరూర్ కు 1072 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే అక్టోబర్ 26న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన ట్విట్టర్ అకౌంట్ బయోలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ అని చేర్చారు.