ఎమ్మెల్యేల ఎర కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్‌

సిట్ విచారణకు సహకరించాలని షరతు

ts-high-court-grants-bail-in-mlas-poaching-case

హైదరాబాద్‌ః టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర కేసులో నిందితులైన ముగ్గురుకి ఈరోజు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. కేసులో నిందితులైన నందు, సింహయాజీ, రామచంద్ర భారతి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సిట్ విచారణకు సహకరించాలని షరతు విధించింది. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు చేయాలని ఆదేశించింది. ముగ్గురూ రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 6 లక్షల పూచీకత్తును సమర్పించాలని తెలిపింది. ముగ్గురి పాస్ పోర్టులను పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలని ఆదేశించింది.

మరోవైపు కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు లాయర్ తన వాదనలను వినిపిస్తూ… వీరు బెయిల్ పై విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని… దీన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ ను నిరాకరించాలని కోర్టును కోరారు.

కాగా, ముగ్గురికి బెయిల్ మంజూరైనప్పటికీ కేవలం సింహయాజీ మాత్రమే ఈరోజు బయటకు రానున్నారు. రామచంద్ర భారతి, నందులపై బంజారాహిల్స్ పీఎస్ లో ఇతర కేసులు ఉన్నాయి. ఈ కేసుల విషయంలో వారిద్దరూ రిమాండ్ లో ఉన్నారు. దీంతో, వారు ఆయా కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు వేసుకోవాల్సి ఉంటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/