తిరిగి పంజాబ్‌ చేరుకున్న అమృత్‌పాల్‌ సింగ్‌.. ?

అమృత్‍పాల్ సింగ్ కోసం పంజాబ్‌ పోలీసులు విస్తృతంగా గాలింపు

Door-to-door search launched in Hoshiarpur village to nab Amritpal

చండీగఢ్‌ః ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే ’ చీఫ్ అమృత్‍పాల్ సింగ్ కోసం పంజాబ్‌ పోలీసులు విస్తృతంగా గాలింపు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 18వ తేదీన పంజాబ్‌ పోలీసుల నుంచి తప్పించుకుని రాష్ట్రం వీడి పారిపోయిన అతను.. మారువేషాల్లో తిరుగుతున్నాడు. మతపరమైన సంప్రదాయ దుస్తులు కాకుండా.. వేషాలు మార్చి తిరుగుతున్నాడు. హర్యానా , పాటియాలా , ఢిల్లీ తదితర ప్రాంతాల్లో దాక్కున్న అతడి జాడ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. అతడు భారత సరిహద్దులు దాటి నేపాల్‌ వెళ్లాడని పోలీసు వర్గాలు భావించాయి. అక్కడి నుంచి నకిలీ పాస్‌పోర్ట్‌ ఆధారంగా విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం.. అమృత్‌పాల్‌ తిరిగి పంజాబ్‌ చేరుకున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అమృత్‌పాల్‌ ఉన్న ఇన్నోవా కారు మార్నియన్‌ సమీపంలోని ఫగ్వారా, హుషియర్‌పూర్‌ హైవే సమీపంలో పోలీసులు గుర్తించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమృత్‌పాల్‌ ఉన్నట్లు భావిస్తున్న కారును పంజాబ్‌ పోలీసులు చుట్టుముట్టే ప్రయత్నం చేయగా.. నిందితుడు కారు వదిలి పరిసర గ్రామాల్లోకి పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఖలిస్థాన్‌ నేత కోసం పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు.