టీడీపీ నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు

పల్నాడు వెళ్లేందుకు టీడీపీ నేతల యత్నం… ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు

Telugu Desam Party
Telugu Desam Party

అమరావతి : పల్నాడు జిల్లాలో నిన్న ప్రత్యర్థుల దాడిలో టీడీపీ కార్యకర్త జల్లయ్య మరణించడం తెలిసిందే. అతడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టీడీపీ నేతలు నేడు జంగమేశ్వరపాడు రావాలని నిర్ణయించుకున్నారు. అయితే, టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గుంటూరులో మాజీమంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు.

విజయవాడలో బుద్ధా వెంకన్నను, తేలుకుంట్లలో యరపతినేని శ్రీనివాసరావును, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డిని గృహనిర్బంధం చేశారు. పొందుగుల వద్ద కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు సంతమాగులూరు వద్ద బీదా రవిచంద్రను అడ్డుకున్న పోలీసులు వినుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దీనిపై నక్కా ఆనందబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో తనను ఆపుతున్నారో సమాధానం చెప్పాలని పోలీసులను నిలదీశారు. తనను అక్రమంగా నిర్బంధిస్తే కోర్టులో పిటిషిన్ వేస్తానని హెచ్చరించారు. వైసీపీ నేతలు చెప్పినట్టల్లా ఆడితే పోలీసులే ఇబ్బందిపడతారని స్పష్టం చేశారు. పట్టపగలే హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ఆనందబాబు ప్రశ్నించారు. పరామర్శకు వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పల్నాడు వెళ్లితీరతామని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/