వైస్సార్సీపీ ఎమ్మెల్సీ చేతిలో హత్యకు గురైన డ్రైవర్ కుటుంబ సభ్యులకు టీడీపీ రూ.5 లక్షల సాయం

వైస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను టీడీపీ పార్టీ ఆర్ధికంగా ఆదుకుంది. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన పార్టీ..ఈరోజు ఆ సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేసింది. ఈ మేరకు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రూ.5 లక్షల చెక్కును టీడీపీ నేతలు సుబ్రహ్మణ్యం కుటుంబానికి శనివారం అందజేశారు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, భార్యకు చెక్కును అందజేసినట్లు టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసిన అనంతబాబును పార్టీ నుంచే కాకుండా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంత బాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వారైనా, ఆయనను కొండ కాపు కింద చూపెట్టి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించకుండా వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోందని రోపించారు. ఈ తరహా కుట్రలను టీడీపీ అడ్డుకుంటుందని ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం ఈ హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంత బాబు) రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు ఆదేశాలతో ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉంచారు. తన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తిని హత్య చేసినట్టు ఆయన అంగీకరించారని కాకినాడ జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు. అనంతబాబు రిమాండ్ రిపోర్టులో కూడా పోలీసులు అదే విషయాన్ని నమోదు చేశారు.