ఏది ఏమైనా బెంగళూరుకు నీటిని సరఫరా చేస్తాంః డీకే శివకుమార్

Bengaluru: DK Shivakumar Assures Adequate Water Supply

బెంగళూరు : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిపై స్పందించారు. ఏది ఏమైనా బెంగళూరుకు సరిపడా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి నెలకొందని, తన ఇంట్లోని బోరు కూడా ఎండిపోయిందని తెలిపారు. వర్షాలు లేక బెంగళూరులో బోరు బావులు ఎండిపోవడంతో తీవ్ర సంక్షోభం నెలకొంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథా చేస్తే జరిమానా తప్పదంటూ ఇప్పటికే పలు హౌసింగ్ సొసైటీలు తమ నివాసితులకు హెచ్చరికలు జారీచేశాయి.

నీటిని సరఫరా చేసేందుకు ప్రైవేటు ట్యాంకర్లు కొన్ని రూ. 600 చార్జ్ చేస్తుంటే, మరికొన్ని రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ధరలను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగా ట్యాంకర్లు అన్నీ అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. దూరాన్ని బట్టి ధరలు నిర్ణయిస్తామని పేర్కొన్నారు. బెంగళూరు నీటి ఎద్దడిని నివారించగలిగే మెకెడాటు రిజర్వాయర్‌ను నిలిపివేసిందంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.

కరవు సమస్యపై ముఖ్యమంత్రి, రెవెన్యూమంత్రి, ఆర్‌డీపీఆర్ సహా ఇతర మంత్రులు చర్చించినట్టు తెలిపారు. పట్టణప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు చుట్టుపక్కల 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు. అలాగే, రామనగర, హోసకోట్, చెన్నపట్న, మగడి సహా ఇతర పట్టణాల నుంచి ట్యాంకర్ల ద్వారా బెంగళూరుకు నీటిని సరఫరా చేయాలని నిర్ణయించినట్టు డీకే తెలిపారు.