కేసీఆర్ పై డీకే అరుణ విమర్శలు

అవినీతి సొమ్ముతో ఏమైనా చేస్తామని కేసీఆర్ అనుకుంటున్నారు: డీకే అరుణ

హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్యాంపెయిన్ పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి తాము ఏదైనా చేయగలమనే సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. హుజూరాబాద్ లో బీజేపీ ప్రచారాన్ని టీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని అన్నారు. రాష్ట్రాన్ని కొల్లగొట్టాం, డబ్బుతో ఓట్లను కొంటాం, అవినీతి సొమ్ముతో ఏదైనా చేస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉపఎన్నికను కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలనుకుంటున్న కేసీఆర్ ను చూస్తే జాలి కలుగుతోందని అన్నారు.

రోజుకో అబద్ధం చెపుతూ కేసీఆర్ కాలం గడుపుతున్నారని అరుణ విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. చివరకు ఆ పథకాన్ని అమలు చేయలేక చతికిల పడ్డారని… పథకాన్ని ఆపేయించిందంటూ బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని పేద దళితులందరికీ దళితబంధును ఇవ్వాలనేదే తమ డిమాండ్ అని చెప్పారు. చివరకు భూములను అమ్ముకుని ఆదాయాన్ని సమకూర్చుకునే దుస్థితికి కేసీఆర్ సర్కారు దిగజారిందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/