దారితప్పుతున్న ప్రజాతీర్పు

రాష్ట్రం: మధ్యప్రదేశ్‌ రాజకీయాలు

Congress_ BJP

ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదే.. అసలు ప్రజాస్వామ్య నిర్వచనమే మహా అద్భుతంగా ఉంది. ప్రజల చేత,ప్రజల కొరకు ప్రజలు పాలించేదే ప్రజాస్వామ్య ప్రభుత్వం.

కానీ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఆయారాం.. గయారాంల సంస్కృతితో మారుతు న్న ప్రభుత్వాలను పరిశీలిస్తే ప్రజల తీర్పు కూడా అటకెక్కుతున్నదని,దీని స్థానంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి స్వార్థం,పదవీలాలస,అమ్యుడుపోయేమనస్తత్వం, మొత్తంగా ప్రజాస్వామ్యాన్నే కాలరాస్తున్నది.

పైగా నియోజకవర్గం నుంచి ఎన్నికైన తర్వాత అయిదేళ్ల వరకు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా ఏవేవో ప్రలోభాలతో కొద్ది కాలానికే రాజీ నామాలు చేసి ప్రజల తీర్పును అవహేళన చేస్తున్న తతంగం కూడా ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపి స్తున్నది.

మొన్న కర్ణాటకలో…ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఈ కోవలోకి వస్తాయి. పైగా ఈరెండు రాష్ట్రాల్లో శాసన సభ్యుల రాజీనామాల ఆమోదం విషయంలో జరుగు తున్న నాటకీయ ప్రహసనాలు మరింత జుగుప్సా కరంగా మారాయి.

స్పీకర్‌ స్థానం కూడా మరింతగా చర్చనీయాంశమైంది. గవర్నర్‌ అధికారాలు-విధుల విషయంలోనూ న్యాయస్థానాల్లో వాదనలు జరిగాయి. మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో నిరూపించుకోవడానికి శాసనసభ సమా వేశం ఏర్పాటు చేసే విషయంలో అధికార,ప్రతిపక్ష పార్టీలమధ్య జరిగిన వివాదంలో గవర్నర్‌, స్పీకర్‌లను వినియోగించుకోవాలని అటు బిజెపి, ఇటు కాంగ్రెస్‌ పన్నిన పన్నాగం బట్టబయలు అయింది.

చివరగా సుప్రీం కోర్టు తీర్పుతో తక్షణమే అసెంబ్లీ సమావేశం నిర్వహించి బలనిరూపణ జరపాల్సివచ్చింది.శాసన సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటంతో, ఇతర మిత్ర పక్షాలను కూడా కలుపుకొని కమల్‌నాథ్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే కాంగ్రెస్‌లోని కలహాలు, కుమ్ములాటలను ఆసరా చేసుకొని అసంతృప్త నేత సింధియాకు పదవీ యోగం కల్పించి,కాంగ్రెస్‌లో 22 మందిఎంఎల్‌ఎలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతమై న బిజెపి ఈమేరకు పావులు కదిపి కాంగ్రెస్‌సర్కార్‌ను పడదోసేందుకు కార్యాచరణ ప్రారంభించింది.

అయితే గుడ్డిలో మెల్ల నయం అన్నట్లుగా రాజీనామాలు చేసిన వారిని నేరుగా పార్టీసభ్యులుగా చేర్చుకోలేదు.అయితే ఫిరాయింపుల చట్టంలో ఈ మేరకు వెసులుబాటు ఉండి ఉంటే ఏ పార్టీ అయినా..ఇదే వైఖరి అవలం భించేందుకు వీలుండేది. అయితే మొత్తం శాసన సభ్యుల్లో మూడింట రెండువంతుల మంది పార్టీ ఫిరాయించేందుకు అవకాశం ఉంటే ఇదే పద్ధతి అవలంభిస్తున్నారు.

ఉదాహరణకు తెలంగాణ అసెంబ్లీలో 19మందికాంగ్రెస్‌ పార్టీ సభ్యులుగా గెలు పొందగా వారిలో మూడింట రెండువంతుల మంది తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి ముందుకు రావడంతో వారందరినీ టిఆర్‌ఎస్‌లో చేర్చుకోగా ఈ మేరకు స్పీకర్‌ కూడా అసెంబ్లీలో వారిని టిఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తిస్తూ బులిటెన్‌ జారీ చేశారు.

ఇదే స్థాయిలో కర్ణాటకలోనూ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌లో చీలక రావడం సాధ్యం కాకపోవడంతో బిజెపి సరికొత్త మార్గాన్ని ఎన్నుకుంది. అసెంబ్లీలో తమ పార్టీ బలం కంటే కాంగ్రెస్‌ బలం తగ్గితే చాలనుకొని, ఈ మేరకు కాంగ్రెస్‌ సభ్యులతో రాజీనామాలు చేయించి పబ్బం గడుపుకునేందుకు విజయవంతంగా ప్రయత్నించింది. తర్వాతి సమయంలో ఈ రాజీనామాలు చేసిన వారికే బిజెపి టికెట్లు ఇచ్చి ఉప ఎన్నికల్లో వారి విజయానికి దోహదపడుతున్నది. వీరి రాజీనామాల వల్లనే సభలో బిజెపికి మెజారిటీ సాధ్యమవుతున్నందున వారికి తిరిగి మంత్రిపదవులుకూడా కట్టబెట్టుతున్నది. అంతా కర్ణాటక ఫార్మూలానే..

అయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్ని కల సమయంలో వచ్చిన ప్రజాతీర్పు ప్రకారం సభలో మెజారిటీ సాధించిన రాజకీయ పార్టీయే మొత్తం అయిదేళ్ల కాలానికి ప్రభుత్వాన్ని కొనసాగించాల్సి ఉండగా అధికార పార్టీ సభ్యుల రాజీనామాల పర్వం వల్ల రాజకీయసమీకరణలు మారిపోతున్నాయి. దీంతో మధ్యలో మరోపార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో రాజ్యాంగంలో తగిన కట్టుబాట్లు లేకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో గుర్తించి రాజ్యాంగ సవరణ చేసినప్పటికీ చట్టపరంగా ఉన్న లోటుపాట్లను ఆయా రాజకీయ పార్టీలు విని యోగించుకుంటున్నాయి.

ఏ రాజకీయ పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదు.ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది పెను ముప్పు అని అందరూ అంగీకరిస్తున్నప్ప టికీ ఈ లోటుపాట్లను సరిదిద్దేందుకు అధికారంలో ఉన్న ఏ రాజకీయపార్టీ కూడా ముందుకు రావడం లేదు.

అయితే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ బల నిరూపణ విషయంలో వచ్చిన వివాదంపై గవర్నర్‌, స్పీకర్‌ అధికారాలపై వచ్చిన వివాదం విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేకంగా వ్యాఖ్యా నించడం గమనార్హం.

రాష్ట్ర గవర్నర్‌కు అసెంబ్లీ విషయంలో మూడు అధికారాలు మాత్రమే ఉన్నాయని అవి సభ సమావేశాలకు నోటిఫికేషన్‌ (సమన్‌) ఇవ్వడం, సభ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రోరోగ్‌ విడుదల చేస్తూ, ముగింపు ను ప్రకటించడం, అసెంబ్లీని రద్దుచేయడం అని మధ్యప్రదేశ్‌ స్పీకర్‌ తర పున అడ్వకేట్‌ వాదించారు.

కానీ మధ్యలో ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లుగా పరిస్థితులు మారితే ఈ సమయంలో అసెంబ్లీ సమా వేశాలు జరగనట్లయితే గవర్నర్‌ ప్రేక్షక పాత్ర ఎలా వహిస్తానరనేది సుప్రీం కోర్టులో చర్చకు వచ్చింది.

అసెంబ్లీ ప్రోరోగ్‌లో ఉంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిందేనని గవర్నర్‌ ఆదేశించే అధికారం ఉందని కూడా సుప్రీం బెంచి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

  • కోనేటి రంగయ్య

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/