కృష్ణా జలాల రగడ ఫై నేడు అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ..

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ రగడ మొదలైంది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించిందని బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పించింది. దీనికి అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చింది అధికార పార్టీ. కేసీఆర్‌ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో నేడు అసెంబ్లీ లో దీనిపై చర్చ జరగనుంది.

సమైఖ్య రాష్ట్ర పాలనలో కన్నా BRS హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగినట్లు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఎమ్మెల్యేలకు తెలియపరిచింది కాంగ్రెస్ సర్కర్. కృష్ణా జలాల నిర్ణయాల్లో జరిగిన అన్యాయాలను ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వివరించనంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు సీఆర్పీఎఫ్ బలగాల నుంచి విముక్తి కల్పించడం సహా తెలంగాణ వాటా తేల్చే వరకు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదంటూ రెండు తీర్మానాలను సభలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.

ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో కృష్ణా జలాల నిర్ణయాలపై ఎమ్మెల్యలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా తదితర మంత్రులు, నేతలకు కృష్ణా జలాల వాడకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సాగు నీటి శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్‌ రెడ్డి అధికారులు వివరించారు. పదేళ్లలో రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలు వివిధ సందర్భాల్లో నాటి సీఎం కేసీఆర్ , ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్‌లను ప్రదర్శించారు. ప్రధానంగా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను ఆంధ్రప్రదేశ్‌ తరలించుకుపోతున్న తీరు తద్వారా తెలంగాణకు జరుగుతున్న నష్టంపై ఎమ్మెల్యేలు రామ్మోహన్‌ రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మదన్‌మోహన్‌లు వివరించినట్లు సమాచారం.