పవన్ కళ్యాణ్ ఫై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేసారు. కౌలు రైతు యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని మండిపడ్డారు. నిన్న పవన్ కళ్యాణ్ కడప జిలాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించిన పవన్ కళ్యాణ్.. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున సాయం అందించారు. మొత్తం 173 మందికి రూ. 1.73 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్ధవటంలో ఏర్పాటు చేసిన సభ లో మాట్లాడుతూ వైస్సార్సీపీ సర్కార్ ఫై విమర్శలు కురిపించారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ నేతలు విమర్శలు స్టార్ట్ చేసారు. చంద్రబాబు దత్త పుత్రుడు, ప్యాకేజీ అంటూ తీవ్ర స్థాయిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు తనకు కులాలు, మతాలు లేవంటూనే మరోవైపు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కులం, మతం, వర్గానికి అతీతంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. కరుడు గట్టిన టీడీపీ కార్యకర్తలకు కూడా మంచి చేసిన వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డని అన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసి వైఎస్సార్‌సీపీకి కులం, మతం అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ రహస్య అజెండాతో పనిచేస్తున్నారని.. ఆయన ఒక కులానికి, వర్గానికి కొమ్ము కాస్తున్నారని డిప్యూటీ సీఎం ఆరోపించారు.