తెలంగాణ ప్రభుత్వంపై నటి డింపుల్ హయాతి సీరియస్..

నటి డింపుల్ హయాతి తెలంగాణ ప్రభుత్వం ఫై సీరియస్ అయ్యింది. గత నాల్గు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ లో వర్షం పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. ఇక ట్రాఫిక్ విషయం అసలు మాట్లాడనేకూడదు. వర్షం పడితే రోడ్ల ఫైనే సగం రోజు గడుస్తుంటుంది. ప్రస్తుతం గత రెండు రోజులుగా హైదరాబాద్ లో అలాగే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరం తడిసిముద్దవుతుంది. ఈ క్రమంలో ట్రాఫిక్ లో చిక్కుకున్న నటి డింపుల్ ..ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ‘పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇంటికి చేరుకోవడానికి గంటకు పైగా సమయం పడుతుంది. ట్రాఫిక్ డీసీపీ ఎక్కడ? ఒకవేళ ఇలాంటి చోట మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఏంటి పరిస్థితి? హైదరాబాద్‌లో ఇంటిలో నుంచి బయటికి అడుగుపెట్టే పరిస్థితి ఉందా? మాకేమీ పెట్రోలు ఉచితంగా రావడం లేదు డియర్ గవర్నమెంట్’ అని డింపుల్ హయాతి ట్వీట్‌లో పేర్కొన్నారు.

డింపుల్ హయాతి ట్వీట్‌పై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. వర్షం పడితే ప్రభుత్వం ఏం చేయాలి..అసలు వర్షం పడే టైం లో మీరు ఎందుకు బయటకు వచ్చారు అని కొంతమంది అంటుంటే..మరికొంతమంది మాత్రం డింపుల్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు.